శాపంగా మారిన సెలవు దినం..

మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం

ఉద్యమ కెరటం, అసిఫాబాద్ జిల్లా  ప్రతినిథి  : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ధాబా గ్రామంలోని చికిలి వాగులో మునిగి శనివారం నలుగురు మరణించిన విషాద సంఘటన నెలకొన్నది. వాగులో మునిగి మరణించిన మూడు కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది. సెలవు దినం కావడం ఆ కుటుంబాలకు శాపంగా మారింది. రెండవ శనివారం సెలవు దినం కావడంతో ఇద్దరు బాలికలు అదే శశికళ (10) , వాడయి మహేశ్వరి (13) , బాలుడు మోహరలే గణేష్ (10) పాఠశాల సెలవు దినం కావడంతో వారి తల్లితో కలిసి చేనుకు వెళ్లారు. చేనులో యూరియా వేసిన తర్వాత యూరియా సంచులను కడగడానికి  చికిలి వాగులో దిగి యూరియా సంచులు శుభ్రం చేస్తుండగా ఒక సంచి నీటిలో కొట్టుకుపోతుండగా దాని తీయడానికి గణేష్ అనే బాలుడు ప్రయత్నించి నీటిలో మునిగిపోయాడు. బాలుడిని రక్షించడానికి తల్లి మొహర్లె నిర్మల బాయి (35) వాగులోకి దిగింది. ఆమె సైతం నీటిలో కొట్టుకోపోతుండడంతో అక్కడ ఉన్న మహేశ్వరి, శశికళ లు ఆమెను రక్షించడానికి ప్రయత్నించి వారు కూడా నీటిలో గల్లంతయ్యారు. ఇది గమనించిన మరో బాలిక గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా గ్రామస్తులు వచ్చి చికిలి వాగులో గాలించి మృతదేహాలను బయటకి తీశారు. అప్పటికే వారు మృతి చెందారు. నలుగురు నీటిలో మునిగి మరణించడంతో ధాబా గ్రామంలో విషాదం  నెలకొంది. మూడు కుటుంబాలకు చెందిన నలుగురు క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అందరిని  కలిచివేసింది.