ప్రభుత్వ విధానాలతో పత్తి రైతులపై ప్రభావం

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారి రవికుమార్
సఖి సెంటర్ ఉద్యోగి మమత కేసులో సమగ్ర విచారణ జరిపించి , ఆమె పిల్లలకు , కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారి రవికుమార్,రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్ డిమాండ్
ఉద్యమ కెరటం, ఆసిఫాబాద్ : కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశంలో పత్తి పంట కొనుగోలుపై రానున్న రోజుల్లో ప్రభావం పడనుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారి రవికుమార్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కుశాన రాజన్న అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్, మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లాల కార్యదర్శులు సంకె రవి, దర్శనాల మల్లేష్ లతో కలసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పంటపై ఉన్న 11% టారిఫ్ ను సున్నాకు తేవడంతో దేశంలోని పత్తి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అమెరికా లాంటి దేశాల నుండి వచ్చే పదివేల కోట్ల పత్తి దేశానికి చేరే ప్రమాదం ఉందని, దీనితో దేశంలోని రైతుల పంట ధర తగ్గుతుందన్నారు. పెట్టుబడి దారి దేశాలకు సహకరించే విధంగా మోడీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అమెరికాకు సహకరించే విధానంలో భాగంగా దేశంలోని రైతులను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయంతో రైతులతో పాటు, జిన్నింగ్ మిల్లుల యజమానులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో యూరియా కొరత సృష్టిస్తున్నారని అన్నారు. రైతులకు యూరియా పంపిణీపై నిర్దిష్ట విధానం లేకపోవడమే కొరతకు కారణమన్నారు. రైతులు యూరియాకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ బీజేపీ నేతలు మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులు పి.ఆర్.సి కోసం చేస్తున్న ఉద్యమానికి తాము మద్దతు పలకనున్నట్లు తెలిపారు. కార్మిక రంగంలో కోటి 20 లక్షల మంది పనిచేస్తున్నారని వారికి కనీస వేతనం వెంటనే 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, అనేక శాఖల్లో నెలల తరబడి వేతనాలు పెండింగ్ లో ఉండడం దారుణం అన్నారు. నెల నెల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి కుశన రాజన్న మాట్లాడుతూ జిల్లాకు ప్రాణాధారమైన అడ ప్రాజెక్టు మరమ్మత్తులు లేకపోవడంతో 45000 ఎకరాలకు గాను 4000 ఎకరాలకు కూడా సాగునీరు అందించే పరిస్థితి లేదన్నారు. వెంటనే పూర్తిస్థాయి మరమ్మతులు చేసి రైతులకు నీరు అందించాలని కోరారు. జిల్లాల కోరిసిన భారీ వర్షాలకు వేల ఎకరాల్లో పంట నష్టపోయిందని, రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. రైతులు నష్టపోయిన పంటను వెంటనే సర్వే చేయించి పరిహారం చెల్లించాలని లేదంటే రైతుల తరపున పోరాడాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా విలేకరులు మమత కేసు విషయం పై అడగగా సఖి సెంటర్లో పని చేస్తున్న ఉద్యోగి మమత కేసులో పోలీసు ఉన్నత అధికారులు సమగ్ర విచారణ జరిపించి ఆమె పిల్లలకు కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, జిల్లా కమిటీ సభ్యులు కార్తీక్, రాజేందర్, ఆనంద్, టీకానంద్ పాల్గొన్నారు.