విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిషేధం
అనుమతులు లేకుండా ర్యాలీలు తీస్తే చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ నితికా పంత్
ఉద్యమ కెరటం, అసిఫాబాద్: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, టపాకాయలు కాల్చడం లాంటి చర్యలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ నితికా పంత్ స్పష్టం చేశారు. గెలిచిన అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి ఉండాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంగా, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అందరూ సమన్వయం పాటించాలని తెలిపారు. లెక్కింపు కేంద్రాల వద్ద శాంతిభద్రతలు కాపాడేందుకు,ఎలాంటి అసాంఘిక చర్యలు చోటుచేసుకోకుండా చూసేందుకు మొత్తం 750 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు. లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో ప్రత్యేక బందోబస్తు, క్యూ.ఆర్.టి టీంలు, స్ట్రైకింగ్ ఫోర్సులు సిద్ధంగా ఉంచబడ్డాయని ఆమె తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని, ర్యాలీలు లేదా ఊరేగింపులు నిర్వహించుట కొరకు సంబంధిత అధికారుల ఉత్తర్వుల మేరకు వారు నిర్దేశించిన తేదీల్లో మాత్రమే జరుపుకోవాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ప్రజలందరూ శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడాలని, ఫలితాలను పరస్పర గౌరవంతో స్వీకరించాలని ఎస్పీ సూచించారు.
