ఆదివాసి ఉద్యమ యోధుడు కోమురం భీం

నేడు పోరుగడ్డ జోడేఘాట్ లో 85వ వర్ధంతి
ఉద్యమ కెరటం , ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : ఆదివాసి ఉద్యమ పోరాట యోధుడు, ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీం.. ఆసిఫాబాద్ మండలం రౌటసంకేపల్లిలో కొమురం చిన్ను, సోంబాయి దంపతులకు 1901 లో జన్మించిన ఆయన నిజాం ప్రభుత్వ దోపిడి, దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ విరోచితంగా పోరాడారు. అడవి పై ఆదివాసులకు హక్కులు కల్పించాలని జల్ ,జంగల్ ,జమీన్ నినాదంతో ఉద్యమం చేపట్టారు. నేడు కొమరం భీమ్ వర్ధంతి నేపథ్యంలో ఆయన పోరాటం పై "ఉద్యమ కెరటం" ప్రత్యేక కథనం.
ఆకృత్యాలను చూడలేక..
గిరిజన ప్రాంతాల్లో పెత్తందారులు, అటవీ శాఖ అధికారుల ఆకృత్యాలను కొమరం భీమ్ కళ్ళారా చూశారు. మేకల మేత కోసం చెట్టుకొమ్మ కొట్టిన తన స్నేహితుడు పై చేతివేళ్లను జంగ్లాత్ సేరేదార్ నరికించడాన్ని చూసి భీమ్ కన్నీరు మున్నీరయ్యారు. తండ్రి చిన్ను విష జ్వరంతో మృతి చెందడంతో సోదరులు సోము, బొజ్జుతో కలిసి రౌటసంకేపల్లిని వీడి కెరమెరి మండలం సుర్దాపూర్ కు చేరుకున్నారు. అక్కడ ఆదివాసులు నెలల తరబడి అడవిని నరికి సేద్యం చేయగా, పంట చేతికొచ్చే సమయానికి జాగిర్దార్ భూముల స్వాధీనం చేసుకునేందుకు యత్నించాడు. జాగిర్దార్ పై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. భీమ్ అక్కడి నుంచి పారిపోయి బల్లార్షా మీదుగా మహారాష్ట్రలోని చాందా చేరుకున్నారు. అక్కడ కొంతకాలం పని చేసి అస్సాం వెళ్ళిపోయారు. కాఫీ ,తేయాకు తోటల్లో పనిచేస్తూ ఐదేళ్లు గడిపారు.
దట్టమైన అడవుల్లో పోరాటం..
అస్సాం నుంచి తిరిగి వచ్చిన కొమురం భీం కెరమేరి మండలం జోడేఘాట్ కేంద్రంగా నిజాం సర్కార్ పై గేరిల్ల పోరాటం చేశారు. ఆయనకు సూరు, వెడమ రాము సహచరులుగా ఉన్నారు. యువకులకు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించవద్దని గ్రామాల్లో ప్రజలను చైతన్య పరిచారు. అప్పుల పేరుతో పంట దోచుకునేందుకు వచ్చే వ్యాపారులు, పన్ను వసూళ్లకు వచ్చే రెవెన్యూ అధికారులపై దాడులు కొనసాగించారు. బాబేఝరి కేంద్రంగా గిరిజనులు అడవి నరికి 12 పోరు గ్రామాలకు ఏర్పాటు చేశారు. నిజాం సర్కారు వారిపై కేసు పెట్టింది. కేసుల నుంచి విముక్తి కోసం హైదరాబాద్ వెళ్లిన భీంకు నవాబు కలిసే అవకాశం దొరకలేదు. ఆయన తిరిగి వచ్చేసరికి జంగ్లాత్ , తదితరులు 12 గ్రామాలపై విరుచుకుపడి తగులబెట్టారు. కలత చెందిన బీమ్ జల్ జంగల్ జమీన్ సాధించాలంటే ఇంటికో పోరాట యోధుడు కావాలని పిలుపునిచ్చారు. గిరిజన యువకులతో సాయుధ దళం ఏర్పాటు చేశారు.
అనుచరుడి వెన్నుపోటుతో మరణం...
నిజాం ప్రభుత్వం చర్చలకు సబ్ కలెక్టర్ ను జోడేఘాట్ కు పంపించింది. 12 గ్రామాలకు పట్టాలిస్తామని అప్పులన్నీ మాఫీ చేస్తామని ప్రతిపాదించాడు. కానీ భీం 12 గ్రామాల మీద రాజ్యాధికారం కావాలని డిమాండ్ చేయడంతో చర్చలు విఫలమయ్యాయి. విషయం నిజాం రాజుకు తెలియడంతో ఆగ్రహానికి గురై భీముని అంత మోదించాలని ఆదేశించారు. 1940లో దాదాపు 7 నెలల పాటు భీమ్ అనుచరులు, నిజాం ప్రభుత్వ సేనల మధ్య యుద్ధం సాగింది. భీమ్ అనుచరుడు మడవి కొద్దు ఇచ్చిన సమాచారంతో అక్టోబర్ 10న భీకరపోరులో కొమురం భీం నేలకొరిగారు. నాలుగు దశాబ్దాలుగా ఏటా జోడేఘాట్ భీమ్ వర్ధంతి నిర్వహిస్తున్నారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఐటీడీఏ ఆధ్వర్యంలో దర్బార్ ఏర్పాటు చేస్తున్నారు.