Black Mafia Urea | బ్లాక్ దందాతోనే యూరియా కొరత
.jpg)
రైతుల గోస పట్టించుకోని రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ , బిజెపి పార్టీల దందాతోనే యూరియా కొరత ఉందని బీ ఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
ఉద్యమ కెరటం సిర్పూర్ టి : తెలంగాణ రాష్ట్రంలో పండుగ రోజు కూడా వర్షంలో యూరియ కోసం రైతులు లైన్లలో నిల్చుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి బీహార్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటూ రైతుల గోస పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సిర్పూర్ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ యూరియ కోసం కాంగ్రెస్, బిజేపి రాజకీయాలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం యూరియ ఇవ్వలేదంటుంటే, బిజెపి ఇచ్చామంటుందని మధ్యలో రైతులే మోసపోతున్నారని తెలిపారు. వాస్తవానికి యూరియ కొరతకు కాంగ్రెస్, బీజేపి పార్టీల బ్లాక్ దందానే కారణమన్నారు. కాంగ్రెస్, బిజెపి నాయకులు తమ అనుచరుల ద్వారా యూరియ తీసుకొని బ్లాక్ లో అధిక ధరలకు అమ్ముతూ జేబులు నింపుకుంటున్నారని పేర్కొన్నారు. రైతుల నుండి దోచుకున్న సొమ్మును రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపుతున్నారని స్పష్టం చేశారు. మరోపక్క విద్యార్థులు ఫీజు రియంబర్స్ మెంట్ రాక అవస్థలు పడుతుంటే, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల టెండర్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మెఘా కృష్ణా రెడ్డి, సిఎం రమేష్ వంటి వారికి ఇస్తున్నారు కానీ,విద్యార్థుల బకాయిలు మాత్రం చెల్లించడం లేదన్నారు. విద్యార్థులకు డబ్బులు లేవు కానీ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి డబ్బులున్నాయా అని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో రైతులు విద్యార్థులు మోసపోయారని,అందుకే తెలంగాణలో తిరిగి కేసిఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల ప్రాణహిత నది పొంగి ప్రవహించడం వల్ల వేల ఎకరాల్లో పంటకు నష్టం కలిగిందని, ప్రభుత్వం బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ మండల కేంద్రంలో అనేక సమస్యలున్నాయని, బస్టాండ్, డైనేజి సౌకర్యం లేదని,100 పడకల హాస్పిటల్ ఉన్నా, డాక్టర్లు సిబ్బంది లేరని, జనరేటర్ పనిచేయడంలేదని వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ మండలంలోని ఆరెగూడ, వెంకటరావుపేట్, డోర్ పల్లి, బెంగాలీ క్యాంపులో పర్యటించిన ప్రవీణ్ కుమార్ గ్రామస్తులను బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ శ్యాంరావు, మండల కన్వీనర్ అస్లాం, సీనియర్ నాయకులు చాంద్ పాషా, కొంగ సత్యనారాయణ, నియోజకవర్గ మహిళా నాయకురాలు లలిత, మండల నాయకులు హీరామన్, వర్మ తదితరులు పాల్గొన్నారు.